Thursday, January 12, 2023

చైతన్యగుప్తుని మేధస్సు


చైతన్యగుప్తుని మేధస్సు


మైథిలీపురి రాజ్యాన్ని చైతన్యగుప్తుడనే రాజు పరిపాలించేవాడు. అతను మేధావి అని దూరదేశాల వరకు మంచి పేరు సంపాదించాడు. చాణక్యపురి రాణి ప్రియంవదకు చైతన్యగుప్తుని మేధస్సు గురించి సమాచారం అందింది. అతని మేధస్సును పరీక్షించాలనుకుంది. 

ఒకరోజు నేరుగా మైథిలీపురికి బయలుదేరి చైతన్యగుప్తుని ఆస్థానానికి చేరుకుంది. చైతన్యగుప్తుడు రాణి ప్రియంవదను సాదరంగా ఆహ్వానించాడు.

ప్రియంవద, "రాజా! మీ మేధస్సు గురించి దేశ విదేశాలలో చర్చలు జరుగుతున్నాయి. స్వయంగా అది చూసిపోదామని వచ్చాను" అని తనతో తెచ్చిన రెండు పూలదండలు చైతన్య గుప్తునికి చూపించింది. 

"మహారాజా! ఈ రెండు దండలలో నిజమైన పూలతో అల్లిన దండ ఏదో కనిపెట్టగలరా?" అని అడిగింది. 

ఆ రెండు పూల దండలు ఒకేలా వున్నాయి. ఏది నిజమైన పూలతో అల్లిందో తెలుసుకోవడం చాల కష్టం. చైతన్యగుప్తుడు తదేకంగా కాసేపు దండలను గమనించాడు. 

కాసేపటి తరువాత "ఇదే అసలైన పూలతో కట్టిన దండ" అని చెప్పాడు. ప్రియంవద ఆశ్చర్యంగా "అదెలా కనిపెట్టారు మహారాజా" అని అడిగింది. 

"మహారాణి! రెండు దండలూ అచ్చంగా ఒకేలా ఉన్నప్పటికీ తేనెటీగలు ఆకర్షించేది అసలైన పూలదండే కదా! కిటికీలో నుంచి ఒక తేనెటీగ వచ్చి ఈ పూల దందా మీద వాలడం గమనించి ఇదే అసలైన పూలతో అల్లిన దండ  అని కనిపెట్టాను" అన్నాడు. 

దానితో రాణి ప్రియంవద చైతన్యగుప్తుని మేధస్సును కొనియాడింది. 



చివరి కోరిక


చివరి కోరిక

 సోమనాథపురంలో చంద్రగుప్తుడనే వర్తకుడుండేవాడు. అతను తను పండించిన ధాన్యాన్ని పక్కనే వున్నా కోసలనగరంలో జరిగే సంతలో అమ్మడానికి తీసుకువెళ్లాడు. మంచి ధర వచ్చి చాలా ధనం సంపాదించాడు. రాత్రి పూట అంత ధనంతో ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదని కోసల నగరంలో వున్న ఒక పూటకూళ్ళ ఇంట్లో దిగాలనుకున్నాడు. తీరా పూటకూళ్ళ ఇంటికి వెళ్లే సరికి ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో గది దొరకలేదు. ఆ పూటకూళ్ళ ఇంటి యజమాని మంచివాడు. చంద్రగుప్తుణ్ణి తన గదిలోనే ఉండమన్నాడు. 

ఆ రాత్రి ఒక దొంగ చంద్రగుప్తుడు, యజమాని పడుకున్న గదిలోకి దూరి చంద్రగుప్తుని ధనాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు. మెలకువ వచ్చిన పూటకూళ్ళ ఇంటి యజమాని అడ్డుకోబోతే దొంగ అతన్ని చంపేశాడు. ఈ గొడవకు పూటకూళ్ళ ఇంట్లో దిగిన యాత్రికులు నిద్రలేచారు. దొంగ కంగారుగా కిటికీలో నుండి పారిపోయాడు. ఆ గదిలోకి వచ్చిన యాత్రికులు యజమాని చనిపోవడం, చంద్రగుప్తుని వద్ద ధనం  చూసి పూటకూళ్ళ ఇంటి యజమానిని ధనం  కోసం చంద్రగుప్తుడే చంపాడని ఊహించి రాజభటులను పిలిపించారు. రాజభటులు చంద్రగుప్తుణ్ణి కోసలనగర మహారాజు వద్దకు తీసుకువెళ్లారు. చంద్రగుప్తుడు జరిగినదంతా వివరించినా మహారాజు నమ్మలేదు. చంద్రగుప్తుడిని ఉరి తీయమని తీర్పు ఇచ్చాడు. ఏ అపరాధికైనా ఉరి శిక్ష వేసే ముందు ఆఖరి కోరిక ఏమిటని అడగడం ఆనాటి పద్ధతి. 

మహారాజు చంద్రగుప్తుడిని "నీ ఆఖరి కోరిక ఏంటి?" అని అడిగాడు. చంద్రగుప్తుడు, తెలివిగా "నాకు శ్రావణ మాసంలో కురిసే వర్షంలో తడవాలని వుంది" అన్నాడు. అయితే అప్పుడు చలికాలం. వర్షాకాలానికి ఇంకా ఆరు నెలలుంది. కానీ అపరాధి ఆఖరి కోరిక తీర్చాల్సిందే. అందుకే మహారాజు ఆరు నెలల తరువాతే చంద్రగుప్తుని ఉరితీయమని ఆదేశించాడు. 

రెండు నెలల తరువాత అసలు దొంగ వేరే దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు. అతన్ని రాజభటులు నిలదీయగా పూటకూళ్ళ ఇంట్లో దొంగతనం చేయబోయి యజమానిని చంపింది తనేనని  ఒప్పుకున్నాడు. మహారాజుకు అసలు విషయం తెలిసి చంద్రగుప్తుడిని విడుదల చేసాడు. 

నిజమైన గెలుపు


నిజమైన గెలుపు

విక్రమసింహుడికి ప్రపంచాన్నంతా జయించి, తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాశ కలిగింది. అందుకోసం అనేక యుద్ధాలు చేసి, చాలా రాజ్యాలను జయించాడు. రక్తం ఏరులై పారిన రాజ్యకాంక్షతో దుర్మార్గంగా ప్రవర్తించసాగాడు. 

ఓ సారి మగధ రాజ్యంతో యుద్ధం చేసి, ఎంతోమందిని చంపి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. విజయగర్వంతో రాజుని బంధించి తీసుకుని వెళ్తుండగా, మార్గమధ్యంలో ఓ యువకుడు పాటలు పాడుకుంటూ, గుర్రంపై వెళ్తూ కనిపించాడు. విక్రమసింహుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని ఆపాడు. 

"ఏరా! ఎప్పుడో ఈ రాజ్యాన్ని జయించాను. కనీసం గౌరవం లేకుండా నా ఎదురుగానే గుర్రపు స్వారీ చేస్తావా? నీకెంత గుండె ధైర్యం! ఎంత పొగరు!" అంటూ అరిచాడు. 

"అలాగా రాజా! మీరు అనుకున్నట్లు ఈ రాజ్యాన్నయితే జయించారు. కానీ  ఈ గుర్రాన్ని జయించారా? లేదు కదా! అందుకే ఈ గుర్రంపై ఎక్కి వస్తున్నాను" అన్నాడా యువకుడు తాపీగా. 

"ఏమిట్రా నీ అహంకారం! ఈ రాజ్యాన్ని జయిస్తే రాజ్యంలో వున్నా గుర్రాన్ని జయించినట్లు కూడా" అని గుడ్లురిమాడు రాజు. 

"కానే కాదు రాజా! మీరు ఈ రాజ్యాన్ని జయిస్తే నాకేంటి... జయించకపోతే నాకేంటి? ఈ గుర్రాన్ని మాత్రం నేనే జయించాను. ఇది నా మాటే వింటుంది. మీ మాట వినదు అంతే" అన్నాడు. 

రాజుకు చిర్రెత్తుకొచ్చింది. కోపం నషాళానికి ఎక్కింది. 

"ఈ రాజ్యాన్ని జయించాను కాబట్టి ఈ గుర్రం నా మాట వినక తప్పదు" అన్నాడు కరాఖండిగా. 

"ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు. కావాలంటే ఆ కొలనులోని నీటిని దానితో తాగించండి చూద్దాం" అని సవాలు విసిరాడు యువకుడు. 

రాజుకు పౌరుషం పెరిగింది. విసురుగా ఆ గుర్రం కళ్లెం చేతబుచ్చుకుని కొలనువైపు ఈడ్చుకెళ్లబోయాడు. గుర్రం అస్సలు కదలలేదు. 

"భటులారా! దీన్ని కొలను దగ్గరకు తోలుకుపోండి" అని ఆజ్ఞాపించాడు. 

భటులు బలవంతంగా గుర్రాన్ని లాక్కెళ్లారు. మహారాజు మీసం తిప్పి "చూసావా నా శక్తి" అన్నాడు. 

ఆ యువకుడు చిరునవ్వు నవ్వి, "అప్పుడే అయిపోయిందా? దానితో నీరు తాగించండి చూద్దాం" అన్నాడు. 

రాజు గుర్రాన్ని కొలనులో దింపించి దాని మూతిని బలవంతంగా నీటిలో ముంచాడు. 

"నీరు తాగు. తాగుతావా లేదా" అంటూ దానితో నీళ్లు తాగించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. గుర్రం తాగలేదు. 

"భటులరా! దీనికి బాగా పొగరులాగుంది. కొరడాలతో చితక్కొట్టి నీళ్లు తాగించండి." అని ఆజ్ఞాపించాడు. 

భటులు గుర్రాన్ని కొరడాలతో బాదారు. అయినా అది నీళ్లు తాగలేదు. 

"చూసారా రాజా! అది మీరెంత తిట్టినా కొట్టిన నీరు తాగదు. నేను చెబితేనే తాగుతుంది. ఎందుకంటే అది నాది" అన్నాడా యువకుడు. 

రాజుకేం చేయాలో అర్థం కాక మౌనంగా వుండిపోయాడు. ఆ యువకుడు గుర్రం దగ్గరకు పోయి, దాని తల నిమిరి, "నీరు తాగు" అన్నాడు. వెంటనే ఆ గుర్రం గటగటా నీరు తాగేసింది. 

రాజు సిగ్గుపడ్డాడు. తన ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించాడు. 

"శభాష్! నా కళ్ళు తెరిపించావు. రాజ్యాలను జయించాలన్న కాంక్షతో మానవత్వాన్ని మరిచాను. మనుషులనైనా, జంతువులనైనా జయించాలంటే ముందు వాటి మనసులను జయించాలని చెప్పకనే చెప్పావు. ఇకపై యుద్ధాలు చేయను గాక చేయను" అని చెప్పి, బంధించిన రాజును వదిలేసాడు. తనలో మార్పుకు కారణమైన యువకుడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చి సత్కరించాడు. 

 

Wednesday, January 11, 2023

కత్తి రంగు


కత్తి రంగు 

అవంతీపురాన్ని జయసేనుడు పరిపాలించాడు. పొరుగు రాజ్యమైన కౌసల్యను రణదీపుడు పాలించేవాడు. వారిద్దరి రాజవంశాల మధ్య తరతరాల నుండి శత్రుత్వం వుంది. ప్రతి చిన్న విషయానికి కత్తులు దూసేవారు. 

రెండు రాజ్యాల మంత్రులు వీరి చేష్టలకు విసిగిపోయారు. ఒక రోజు, వారు సమావేశమై వారి రాజుల మధ్య వైరాన్ని తొలగించేందుకు ఒక ఉపాయం ఆలోచించారు. దాని ప్రకారం రాజులకు రెండు దేశాల సరిహద్దు వద్ద వున్నా పెద్ద చెట్టు దగ్గరకు తీసుకుని రవళి. సమావేశం రోజు ఉదయం ప్రధానమంత్రులిద్దరూ చెట్టు కొమ్మకు ఒక కత్తి ఒరను వేలాడదీశారు.

అనుకున్న సమయానికి ఇద్దరు రాజులూ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. కొద్ది దూరం నుండే ఒకరినొకరు చూసుకుని మొహాలు చిట్లించుకుని, వేలాడుతున్న ఒరను చూసారు. 

జయసేనుడు పరవశుడై ఇలా అన్నాడు "ఆహ! ఎంత అద్భుతమైన ఒర! వజ్రవైడూర్యాలు ఈ ఎర్రటి ఒరను మరింత అమూల్యమైనదిగా మార్చాయి."

బదులుగా రణదీపుడు "ఏం మాట్లాడుతున్నావ్? ఇది నిస్సందేహంగా అమూల్యమైనదే. కానీ ఇది తెలుపురంగుది నీవు చెప్పినట్లు ఎరుపురంగుది కాదు."

జయసేనుడు కరుకైన స్వరంతో, "నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావు. నేను చూస్తున్నాను కదా! అది ఎరుపు రంగుదే" అని అరిచాడు. 

రణదీపుడు కూడా సహనాన్ని కోల్పోయి "నీవు గుడ్డివాడివనుకుంటా. ఒర తెల్లగా వుంది, తెలుపు ముత్యాలు పొదగబడి వుంది" అన్నాడు. 

"నువ్వు నన్ను ఇక్కడకు కేవలం యుద్ధానికే పిలిచావనుకుంటా" జయసేనుడు తన కత్తి బయటకు లాగాడు. రణదీపుడు కూడా అంతే వేగంగా కత్తి బయటకు తీసాడు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ముందుకు దుమికారు. అంతే, పక్కనే పొదల మాటున దాక్కున్నా వారి ప్రధానమంత్రులు బయటకు వచ్చి ఇలా అన్నారు. "ఓ రాజుల్లారా! ఆగండి! పోట్లాడే ముందు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. 

"మీరు ఈ కత్తిని రెండు వైపుల నుండి చూడవలసింది. మీరిద్దరూ నిజమే చెబుతున్నారు. ఈ ఒర ఒకవైపు ఎరుపుగా మరోవైపు తెల్లగా వుంది."

"నిజమా!" రాజులు ఆశ్చర్యపోయారు. 

ప్రధానమంత్రులు ఇంకా ఇలా చెప్పసాగారు. "ఇప్పటి కత్తి విషయంలో జరిగినట్టు, యుద్ధాలు, సమరలు అనేవి అపార్ధాలకు పర్యవసానాలు."

ఇద్దరు రాజులూ వారి తప్పులను తెలుసుకొని సఖ్యతగా ఉండేందుకు చేతులు కలిపారు. 


మంచి పనుల డబ్బా!

మంచి పనుల డబ్బా! 


గోపాలుడనే బుద్ధిమంతుడైన కుర్రాడికి అతని నాన్నమ్మ ప్రతిరోజూ రకరకాల కథలు చెప్పి నిద్రపుచ్చేది. పాతాళలోకం కథలు, నాగలోకం కథలు, గంధర్వలోకం కథలను గోపాలుడు చాలా ఆసక్తిగా వినేవాడు. 

ఒక రోజు నాన్నమ్మ గోపాలుడికి స్వర్గ లోకం గురించి చెప్పింది. ఆ రోజు నుండి గోపాలునికి స్వర్గలోకం చూడాలని కోరిక పుట్టింది. నాన్నమ్మ అలా కుదరదు అని చెప్పిన ఒప్పుకోలేదు. 

ఒకరోజు రాత్రి నిద్రపోయే ముందు దేవుడిని స్వర్గలోకం చూపించమని ప్రార్థించి పడుకున్నాడు. రాత్రి కలలో దేవుడు కనిపించి "నీకు స్వర్గలోకం చూడాలని వుంది కదూ? నువ్వు సినిమా చూడాలన్న, సర్కస్ చూడాలన్న దానికి టిక్కెట్టు కొనాలి కదా అదే విధంగా స్వర్గలోకం చూడాలన్నా టిక్కెట్టు కొనాలి. అయితే స్వర్గంలో ఇక్కడి రూపాయలు చెల్లవు. అక్కడ మంచి పనుల రూపాయలు చెల్లుతాయి. ఈ డబ్బా నీ దగ్గర ఉంచుకో, నువ్వు చేసే ప్రతి మంచి పనికి ఈ డబ్బాలో ఒక నాణెం పుడుతుంది. నువ్వు చేసే ప్రతి చెడ్డ పనికి డబ్బాలో ఒక నాణెం తగ్గుతుంది. ఆ డబ్బా నిండిన రోజు నువ్వు స్వర్గం చూడవచ్చు." అని చెప్పాడు. 

మరునాడు పొద్దున్న లేచేసరికి అతనికి తన మంచం పక్కనే ఒక డబ్బా కనిపించింది. ఆ రోజు నుండి మంచి పనులు చేసినప్పుడల్లా ఆ డబ్బాలో ఒక నాణెం కనిపించేది. చెడ్డపనులు చేసినప్పుడల్లా ఆ డబ్బాలో ఒక నాణెం తగ్గేది. ఆలా ఆ డబ్బా దాదాపు నిండగా ఒక రోజు ఇంటి ముందు ఒక సాధువు వచ్చి గోపాలుడితో "బాబూ! నేను ముసలివాడినయ్యాను కానీ నా డబ్బా నాణాలతో నిండలేదు. నీ డబ్బా నాకిస్తావా?" అని అడిగాడు. అప్పుడు గోపాలుడు "బాబా నా డబ్బాని  నీకు సంతోషంగా ఇస్తాను." అని తన మంచి పనుల నాణేల డబ్బాను అతనికి ఇచ్చాడు. 

ఆ రోజు గోపాలునికి దేవుడు ప్రత్యక్షమై అతని నిస్వార్థ బుద్ధిని మెచ్చుకున్నాడు. కలలో స్వర్గదర్శన మిచ్చి "మనుషులు చేసే మంచి పనుల వాళ్ళ ఈ భూమిని స్వర్గంగా మార్చగలరు" అని చెప్పాడు. 


నక్క ఉపాయం


నక్క ఉపాయం

రామయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. అది ముసలిదయ్యింది. ముసలి గుర్రం తనకు పనికిరాదని, దానికి తిండి పెట్టడం వృథా అనుకున్నాడు రామయ్య. ఒక రోజు గుర్రంతో "నీకిప్పుడు బలం లేదు, నువ్వు నాకు పనికి రావు నువ్వు అడవికి వెళ్ళిపోయి నీ దారి నువ్వు చూసుకో. సింహం కన్నా బలశాలి అయిన రోజున మళ్ళీ రా" అని చెప్పి దాన్ని తరిమేశాడు.

గుర్రం ఏడుస్తూ ఒక చెట్టు కింద నిలబడింది. అక్కడికి ఒక నక్క వచ్చింది. నేస్తమా ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. దానికి గుర్రం జరిగిన విషయం చెప్పింది.

అప్పుడు నక్క "నువ్వు బాధపడకు, నేను ఒక ఉపాయం చెప్తాను. నేను చెప్పినట్టు చేయి. ఇక్కడే చచ్చిపోయినట్టు నటించు". అని చెప్పింది. గుర్రం అలానే చేసింది.

నక్క సింహం దగ్గరకు వెళ్లి "మన అడవి చివరిలో ఒక గుర్రం చచ్చి పడి వుంది. మనం దాన్ని తినచ్చు, వస్తావా?" అని అడిగింది. అప్పుడు సింహం అక్కడికి వచ్చింది. నక్క సింహంతో "ఇక్కడ మనుషులు అప్పుడప్పుడు తిరుగుతూ వుంటారు. మనం ఈ గుర్రాన్ని అడవిలోకి తీసుకెళ్లి తిందాం. నేను ఒక తాడుతో ఈ గుర్రం తోకను నీ తోకతో కడతాను. అడవిలోకి తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుంది." అని ఇద్దరి తోకలని తాడుతో కట్టింది.

గుర్రం చెవిలో "పరిగెత్తు" అని మెల్లగా చెప్పింది. గుర్రం వేగంగా ముందుకు పరిగెత్తింది. ఇది ఊహించని సింహం కిందపడిపోయింది. గుర్రం సింహాన్ని ఈడ్చుకుంటూ తన యజమాని దగ్గరకు వెళ్ళింది. దానితో రామయ్య "నా గుర్రం బలశాలి" అనుకుని గుర్రాన్ని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు.


దురాశ - Greediness

 

దురాశ

ఇంద్రావతి నదీ తీరంలో సువర్ణపురి అనే రాజ్యాన్ని సోమనాథుడు అనే రాజు పాలించేవాడు. అతడు తరచూ రాజ్యమంతా పర్యటించేవాడు. ప్రజల కష్ట సుఖాలను విచారించి, అవసరమైన వారికి సహాయం చేసేవాడు. ఆ రాజ్యంలో రంగడనే యువకుడు ఉండేవాడు. అతడు చాల దురాశాపరుడు, సోమరి. కష్టపడి పని చేయక భిక్షాటనతోనే జీవనం సాగించేవాడు. 

రంగడు ఒక రోజు భిక్షాటన కోసం పొరుగూరు వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఒకామె రంగడి గిన్నె లో బియ్యం పోస్తూండగా, ఆ రోజు రాజు ఆ ఊళ్ళో పర్యటిస్తునట్టు తెలుసుకున్నాడు. గిన్నె నిండా బియ్యం చుస్తే రాజు తనకు ఏమీ దానం చేయకపోవచ్చని బియ్యం మొత్తం కింద పారబోసి ఖాళీ గిన్నెతో పరిగెత్తుకుంటూ రాజా దగ్గరికి వెళ్ళాడు. 

"మహారాజా ! మీరు చాలా దానధర్మాలు చేస్తారని విన్నాను. నేను చాలా పేదవాణ్ణి. చాలా రోజులుగా అన్నం కూడా తినలేదు అని రాజుతో చెప్పాడు రంగడు. 

బదులుగా రాజు... "నీ కష్టాలు చెప్పడం తప్పించి రాజుకి నువ్వు ఏమీ కానుక ఇవ్వలేవా?" అని అడిగాడు. రంగడి చేతిలోని గిన్నెలో ఐదు గింజలు మాత్రమే అంటుకుని వున్నాయి. వాటిని సోమనాథుడికి   ఇచ్చాడు. రాజు ఆ ఐదు బియ్యపు గింజలు తీసుకుని వెళ్ళిపోయాడు. 

"రాజు ఎంత పిసినారి. నా  దగ్గర ఐదు గింజలు తీసుకుపోయాడు" అని మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి రంగడు తిరిగి ఇంటికి వెళ్లేసరికి గుమ్మం ముందు ఒక బియ్యం బస్తా కనిపించింది. అందులో ఐదు బంగారు నాణేలు కూడా వున్నాయి. అది చూసి రంగడు ఎంతో సంతోషపడ్డాడు. 

"మహారాజు పిసినారి కాదు. నేనిచ్చిన ఐదు బియ్యవు గింజలకు బదులుగా ఐదు బంగారు నాణేలు ఇచ్చాడు. నేనే దురాశపడుడిని. విలువైన బహుమానాల ఆశతో చేతిలో వున్న బియ్యాన్ని నేలపాలు చేశాను. ఆ మొత్తం బియ్యం కనుక మహారాజుకి ఇచ్చి ఉంటే బస్తా నిండా బంగారు నాణేలు ఉండేవి. న దురాశకు తగిన శాస్తి జరిగింది" అని బాధపడ్డాడు రంగడు. 

నీతి: దురాశ దుఃఖానికి చేటు. 

ఎద్దు - గాడిద (Ox and Donkey)

ఎద్దు - గాడిద

కిట్టయ్య అనే రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానితో అతడు పొలం దున్నడం, బండిలాగడం చేసేవాడు. ఈ  పనులతో రోజూ ఎద్దు అలసిపోయేది. తన దుస్థితికి యజమానిని రోజూ మనసులోనే తిట్టుకునేది. 

 కొన్ని రోజుల తరువాత కిట్టయ్య ఒక  గాడిదను కొనుక్కొచ్చి కొట్టంలో కట్టాడు. ఆ రోజు సాయంత్రం కొట్టంలో గాడిద ఎద్దుతో మాట్లాడుతూ... " ఎలా వున్నావు మిత్రమా ?యజమాని నిన్ను బాగా చూసుకుంటాడా?" అని అడిగింది. 

"లేదు మిత్రమా, నన్ను ప్రతి రోజూ కొడతాడు. పొద్దస్తమానం నాతో ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటాడు" అంది. 

"పని తప్పేలా నేనొక ఉపాయం చెప్పనా?" అని అడిగింది గాడిద. 

నువ్వు ఏం చెప్పినా అది తప్పకుండా చేస్తాను మిత్రమా" అని బదులిచ్చింది ఎద్దు. 

"నువ్వు జబ్బు పడ్డట్టుగా నటించు. గడ్డి తినకు, కుడితి తాగకు. అలా చేస్తే నీకు నిజంగానే ఆరోగ్యం బాగాలేదు అనుకుంటాడు. జాలిపడి నిన్ను పనికి తీసుకెళ్లడు" అని సలహా ఇచ్చింది గాడిద. ఆ సలహా ప్రకారం మర్నాడు ఎద్దు మేత మేయలేదు, కుడితి తాగలేదు. కనీసం నిలబడలేనట్టు నటించింది. ఎద్దు పరిస్థితి చూసాక యజమాని దాన్ని ఏమీ అనకుండా వదిలేసాడు. 

రెండోరోజు కూడా ఎద్దు అలాగే చేసింది. రైతు దాని జబ్బు ఇంకా తగ్గలేదు అనుకుని సగంలో నిలిచిన పనిని పూర్తి చేయడానికి గాడిదను పొలానికి తీసుకెళ్లాడు. అలవాటులేని పని కావడంతో పొలం దున్నిన గాడిద బాగా అలసిపోయింది. "ఓరి దేవుడో! ఈ చాకిరీ నేనెక్కడ చేస్తాను. పని ఎగ్గొట్టడానికి ఎద్దుకు ఉపాయం చెబితే అది నా  మెడకు చిక్కుకుంది. అబద్ధం చెప్పడమే కాదు, అబద్ధం చెప్పమని ఎవరికైనా సలహా ఇవ్వడం కూడా చాల తప్పు. ఇంకెప్పుడూ  ఇలాంటి తెలివి తక్కువ పని చేసి కష్టాలు కొనితెచ్చుకోను" అనుకుంది బుద్దిగా. 

నీతి: అబద్ధం చెప్పడమే కాదు, అబద్ధం చెప్పమని ఎవరికైనా సలహా ఇవ్వడం కూడా చాల తప్పు


Monday, January 9, 2023

ధర్మరాజు

 ధర్మరాజు


ఒకానొక పల్లెటూరిలో నరసింహ అనే రైతు ఉండేవాడు. ఆటను చాల అహంకారి, కోపిష్టి. ఊరిలో అందరితో తగవు పెట్టుకునే వాడు. ఊరిలో ఎవరితోనూ స్నేహంగా ఉండేవాడు కాదు. కోపం వచ్చినపుడు చేయి చేసుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదు. 

ఒక రోజు ఆ ఊరికి ధర్మరాజు అనే రైతు వచ్చాడు. ఊరిలో జనమంతా అతనితో "నువ్వు నరసింహ జోలికి వెళ్ళకు, అతను చాల చెడ్డవాడు, అతనితో స్నేహం చేయకు" అని సలహా ఇచ్చారు. కానీ ధర్మరాజు మంచి స్వభావం కలవాడు కనుక అతనితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నరసింహ ప్రతిసారి ధర్మరాజును అవమానించి, తగువులాడి పంపించాడు. ఊరిజనమంతా ధర్మరాజుతో "చూసావా మేము చెప్పింది ఇప్పటికైనా అర్థమైందా?" అని అడిగారు. దానికి ధర్మరాజు " అందుకే నేను సమయం చూసి నరసింహను చంపుతాను" అని చెప్పాడు. 

ఒక రోజు నరసింహ పక్క ఊరికి ఎడ్ల బండి మీద వెళ్ళాడు. జోరుగా వర్షం కురిసింది. తను ఊరికి  తిరిగి వస్తూ ఉండగా చీకటి పడింది. బంక మట్టిలో బండి చక్రం ఇరుక్కుపోయింది. ఇక తానూ ఆ రాత్రికి ఊరు చేరుకోగలనే నమ్మకం కూడా లేక పోయింది నరసింహకు. ఊరిలో వారందరికీ నరసింహ తిరిగి రాలేదన్న విషయం తెలిసిన ఎవ్వరు సహాయం చేయడానికి లేదా అతన్ని వెతకడానికి ప్రయత్నించలేదు. 

ధర్మరాజు బండి చిక్కుకున్న ప్రాంతానికి బయలుదేరాడు. ఊరిజనమంతా ఆ అహంకారికి సహాయం చేయడం అనవసరం అన్నారు. అప్పుడు ధర్మరాజు "నేను అతనికి సహాయం చేయడానికి కాదు, చంపడానికి వెళ్తున్నాను" అన్నాడు. కానీ వెళ్లి నరసింహను ఆపద నుండి రక్షించాడు. నరసింహ సిగ్గుతో తలా వంచుకున్నాడు. 

జనమంతా ధర్మరాజును "నరసింహాను చంపుతావని వెళ్ళావు ఏమైంది?" అని అడగగా ధర్మరాజు "నేను చంపుతాను అన్నది నరసింహాను కాదు అతని అహంకారాన్ని" అని సమాధానమిచ్చాడు. 



Friday, January 6, 2023

పట్టుబడిన నటుడు

 పట్టుబడిన నటుడు


రవివర్మ ఆస్థానంలో గణపతిశాస్త్రి అనే మంత్రి ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. తెలివి, సమయస్ఫూర్తితో ప్రజల వివాదాలను తీర్చేవాడు. 

ఒకరోజు భీమసేనుడనే వర్తకుడు గణపతిశాస్త్రి వద్దకు వచ్చి "అయ్యా! నేను సుధనుడనే నటుడికి కష్టకాలంలో ధనమిచ్చి సహాయం చేశాను. ఇప్పుడు అతను స్థితిమంతుడయ్యాడు. నేను నా అప్పు తీర్చమని చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగాను. కానీ విచిత్రమేమిటంటే నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా అతనిని పోలిన ఐదుగురు వ్యక్తులు కనిపిస్తారు. ఎవరిని పలకరించిన నేను సుధనుడు కాదంటే నేను కాదని అంటున్నారు. ఎవరిని ధనం  అడగాలో తెలీడం లేదు" అన్నాడు. 

గణపతిశాస్త్రికి ఈ  విచిత్రమైన సమస్య పట్ల కుతూహలం కలిగింది. మరునాడు భీమసేనుడితో సుధనుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుధానుని పోలిన నలుగురు ఒకే వేషధారణతో వున్నారు.

గణపతిశాస్త్రి "మీ అందరి వేషధారణ చాల బాగుంది. అందరు ఒకేలా వున్నారు. మీలో సుధనుడేవరో కనిపెట్టడం చాలా కష్టమే. కాకపోతే ఒక చిన్న తప్పు చేసారు. ఆ తేడా వాళ్ళ కనిపెట్టడం కష్టం కాదు అన్నాడు. 

ఆ మాటలు విన్న నిజమైన సుధనుడికి తాను వేయించిన వేషధారణలో చేసిన తప్పేమిటో తెలుసుకునే ఆత్రుత కలిగింది. వెంటనే "తప్పా! ఎక్కడ? ఏం తేడా కనిపిస్తుంది?" అని అడిగాడు. 

గణపతిశాస్త్రికి వెంటనే సుధనుడు ఎవరో తెలిసిపోయింది. "నువ్వేగా నిజమైన సుధనుడివి" చిన్నగా నవ్వుతూ అడిగాడు. సుధనుడు  అవునన్నట్లు తలూపాడు. తమ పనితనం గురించి తప్పు పట్టినప్పుడు ఆ తప్పేమిటో తెలుసుకునే ఆత్రుత ఎవరికైనా ఉంటుంది. ఆ మెలికను కనిపెట్టి గణపతిశాస్త్రి సుధనుడు  ఎవరో గుర్తుపట్టాడు. భీమసేనుడికి ధనాన్ని తిరిగి ఇప్పించాడు. 



పేరులేని పక్షి - Nameless Bird

 

పేరులేని పక్షి 


ఒక అడవిలో రకరకాలైన పక్షులుండేవి. అవన్నీ ఒకరోజు తమలో ఒక రాజుని ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటుచేసుకున్నాయి. "ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు" అని నిర్ణయించాయి. 

ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. అన్ని పక్షులు ఎగరడం మొదలు పెట్టాయి. అన్నిటి కన్నా గద్ద చాలా పైకి ఎగిరింది. అన్ని పక్షులు "గద్దే రాజు" అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆ గద్ద  రెక్కలలో దాక్కున్న ఆ పేరు లేని పక్షి ఇంకా పైకి ఎగిరింది. గద్ద  అప్పటికే ఆయాస పడటం వల్ల ఎగరలేకపోయింది. 

పేరులేని పక్షి "నేనే రాజు, నేనే రాజు" అని సంబరపడింది. పక్షులకు అది మోసం చేసిందని తెలిసి "ఎవరు నీటిలో లోతుగా వెళ్లగలరో వారే రాజు" అన్నాయి. బాతు నీటిలోపలికి వెళ్ళింది. చాలా లోతుకు వెళ్ళింది అనుకునేసరికి పేరు లేని పక్షి మళ్ళీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా లోపలి వెళ్లి "నేనే గెలిచాం, నేనే రాజుని" అనడం మొదలుపెట్టింది. మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చక దానిని ఒక పొలంలో బంధించి ఒక గుడ్లగూబను కాపలాగా పెట్టారు. 

గుడ్లగూబ కష్టపడి నిద్రలేక కాపలా కాసింది కానీ ఒక్క క్షణం కునుకు పట్టింది. అప్పుడు పేరు లేని పక్షి మాయమైంది. అన్ని పక్షులు గుడ్లగూబను నిలదీశాయి. అందుకే గుడ్లగూబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు.  

విలువైన కానుక - Valuable Gift

 

విలువైన కానుక 

ఒక ఊరి చివర గుడిసెలో విమలమ్మ తన కొడుకు రాధీశ్ తో నివసించేది. తండ్రి లేనందువల్ల కొడుకును కష్టపడి పెంచింది. రాధీశ్ చాలా బుద్ధిమంతుడు. మంచి విద్యాభ్యాసం కోసం విమలమ్మ తన కొడుకుని పక్క ఊరిలో వున్న గురువుగారి దగ్గరికి పంపించేది. రోజూ ఆశ్రమానికి వెళ్లాలంటే అడవి దాటవలసి వచ్చేది. "అమ్మా! నాకు ఒంటరిగా అడవి దాటాలంటే భయం" అన్నాడు రాధీశ్. అందుకు విమలమ్మ "బాబు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడెప్పుడు మనతోనే ఉంటాడు. నువ్వు పిలిచినప్పుడు తప్పకుండ వస్తాడు" అని చెప్పింది. 

ఒక రోజు రాధీశ్ అడవిలో నడిచేటప్పుడు, "కృష్ణా, కృష్ణా నాకు భయంగా వుంది" అని పిలిచాడు. వెంటనే దేవుడు బాలుని రూపంలో ప్రత్యక్షమై అతన్ని అడవి దాటించాడు. ఇలా రోజూ రాధీశ్ కృషుణ్ణి పిలవడం, బాలుని రూపంలో వున్న కృష్ణుడితో ఆదుకోవడం మొదలుపెట్టాడు. 

ఒక రోజు గురువుగారి ఆశ్రమంలో పెద్ద పూజ జరగనుంది. చాలా పెద్ద విందును ఏర్పాటు చేసారు. రాధీశ్ తోటి శిష్యులందరు బుట్టలకొద్దీ పళ్ళు తేవాలని, బిందెల నిండా నెయ్యి, పాలు తేవాలని మాట్లాడుకున్నారు. రాధీశ్ తన తల్లిని అడిగినప్పుడు అంతంత కానుకలు ఇచ్చే స్తోమత మనకు లేదని చెప్పింది విమలమ్మ. నిరాశతో, తన తోటి విద్యార్థులు, గురువు ఎక్కడ హేళన చేస్తారో అనే బాధతో అడవి దాటుతూ ఆశ్రమం వైపుకి వెళ్ళాడు. 

ఎప్పటిలాగానే, అడవిలోకి కృష్ణుడు వచ్చాడు. "రాధీశ్ ఎందుకు బాధ పడుతున్నావ్?" అని అడిగాడు. జరిగిన విషయమంతా వివరించాడు రాధీశ్. కృష్ణుడు ఒక చిన్న గిన్నెలో పాలిచ్చి "ఇది మీ గురువుగారికి ఇవ్వు" అని చెప్పాడు. రాధీశ్ ఆశ్రమం చేరాడు. తోటి విద్యార్థులందరూ పెద్ద పెద్ద బిందెల నిండా, గంగాళాల నిండా పాలను తెచ్చారు. రాధీశ్  తెచ్చిన చిన్న గిన్నెను చూసి తోటి శిష్యులంతా హేళన చేసారు. గురువుగారు ఆ గిన్నెను స్వీకరించి ఒక గంగాళంలొ  పోశారు. ఆశ్చర్యం! అది నిండిపోయింది. గిన్నెలో ఇంకా పాలున్నాయి! ఇంకో గంగాళంలో పోశారు. అదీ నిండిపోయింది. ఆలా ఆ గిన్నెలో పాలు అక్షయమవుతూనే వున్నాయి. గురువుగారు, విద్యార్థులు చాలా ఆశ్చర్యపోయారు. 

గురువుగారు రాధీశ్ ని "ఆ పాలు ఎవరిచ్చారు?" అని అడిగారు. రాధీశ్ జరిగిన విషయమంతా చెప్పినప్పుడు గురువుగారు "రాధీశ్ నీకు అడవిలో రోజూ కలిసే బాలుడు ఎవరో కాదు. శ్రీ కృష్ణ పరమాత్ముడే. నువ్వు ఎంత కానుక తెచ్చావు అనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో ఇస్తున్నావనేదే ముఖ్యం" అన్నారు. తోటి విద్యార్థులు రాధీశ్ ని హేళన చేసినందుకు సిగ్గుతో తలవంచుకున్నారు.  

ముందు చూపు - Foresight

 

ముందు చూపు

చంద్రపురి రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పరిపాలించేవాడు. విక్రమవర్మ ఒక రోజు తన మంత్రితో రాజ్యంలో సంచారం చేస్తూ ఒక తోట దగ్గరకు వచ్చాడు. 

అక్కడ ఆయనకు ఒక వృద్ధుడు కనిపించదు. ఆ వృద్ధుడి వయస్సు ఎనభై సంవత్సరాలకు దగ్గరగా ఉంటుంది. వణికే చేతులతో ఆయన ఒక మామిడి మొక్కను నాటుతున్నాడు. 

విక్రమవర్మ ఆ ముసలి తాతను ఉద్దేశించి "తాతా ! ఈ తోటలో నువ్వు పని చేస్తున్నావా? లేక ఇది నీ సొంత భూమా? " అని అడిగాడు. 

దానికి ఆ వృద్ధుడు "మహారాజా! ఇది నా తాత ముత్తాలనాటి  భూమి" అన్నాడు. విక్రమవర్మ "మరి అంత కష్టపడి మామిడి మొక్కను నాటుతున్నావేం? నువ్వు ఇప్పుడు నాటిన మామిడి మొక్క పెరిగి చెట్టై పండ్లు కాయడానికి చాల సంవత్సరాలు పడుతుంది. ఆ పండ్లను తినడానికి నువ్వు బతికుంటావనే నమ్మకం నీకుందా?" అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. 

దానికి ఆ ముసలితాత "నేను ఇన్ని రోజులూ నా తాత ముత్తాతలు నాటిన చెట్ల పండ్లను తిన్నాను. నేను నాటిన చెట్ల పండ్లను నా తరువాత తరం వారు తింటారు. మనం నాటిన చెట్ల పండ్లను మనమే తినాలి అనుకోవడం స్వార్థమవుతుంది" అన్నాడు. 

విక్రమవర్మ ఆ సమాధానికి సంతోషించాడు. ఆ ముసలి తాతను తన భవనానికి పిలిచి సత్కరించాడు. 

ఆకలి కాయల పులుసు

 

ఆకలి కాయల పులుసు

మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాల పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంట వారిని నియమించాడు. నాలుగు పూటలూ రకరకాల వంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికరమైన భోజనానికి అలవాటుపడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని రాజుకు రానురాను ఏ వంటకం రుచించకుండా పోయింది. ఏదైనా అతిగా చేస్తే అంతేమరి! ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలు పెట్టాడు. 

ప్రసిద్ధిచెందిన వంటివారు వండినప్పటికీ, రుచిగా లేదని శిక్షించాడు. ఆలా ఆఖరికి, రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది. 

అక్కడి ఆస్థానంలో పని చేసేవారే రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకున్నారు. వంటవారి కోసం రాజ్యమంతా వెతికిన భీమసేనుని తృప్తి పరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. 

ఆఖరికి పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్దమయ్యాడు. ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేనరాజు "ప్రపంచంలో నేను ఎన్నడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా?" అని అడిగాడు. 

అప్పుడు ఆ యువకుడు "మహారాజా మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి వుంది. దాని పేరు ఆకలి కాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. కోసిన వెంటనే వండాలి  కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు" అన్నాడు. రాజుకు కొత్త వంటకం గురించి విని నోరూరింది. ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు. 

ఆలా పొద్దున్నే బయలు దేరిన వాళ్ళు  సాయంత్రం  అయినా నడుస్తూనే వున్నారు. రాజుకు చాలా ఆకలి వేయసాగింది. "ఇంకా ఎంత దూరం?" అని అడగడం మొదలు పెట్టాడు. ఆఖరికి యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు. "మహారాజా, ఇదే ఆకలి కాయల పులుసు" అన్నాడు. భీమసేనుడు ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచించింది. అలంటి పులుసు తాను ఎన్నడూ తినలేదు అన్నాడు. 

అప్పుడు యువకుడు "మహారాజా! ఇది మామూలు ఉల్లిపాయలు పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది. ఆకలి లేని వారికీ పంచభక్ష్య పరమాన్నమైనా రుచించదు. అదే ఆకలితో వున్నా వారికీ ఎలాంటి భోజనమైన రుచిస్తుంది." అని చెప్పాడు. రాజుకు తన పొరపాటు తెలిసివచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు. 

కోయిల వైద్యం

 

కోయిల వైద్యం


ఒక చెట్టు మీద కాకి, కోకిల గుడ్లగూబ ఉండేవి. ఒక రోజు ఒక బాలుడు ఆడుకుంటూ అటు వచ్చాడు. ఆ బాలుడు మట్టితో పెళ్లలు చేసి చెట్టుకేసి కొట్టాడు. ఒక మట్టి పెళ్ల గుడ్లగూబకు తగిలింది. అది దాని రెక్కలలో ఇరుక్కుపోయి బాగా నొప్పి కలిగింది.

అప్పుడు కాకి గుడ్లగూబ బాధ చూడలేక దానితో "మన చెట్టుమీద నివసించే కోకిలకు మంచి వైద్యం తెలుసు, దాని వద్దకు వెళ్దాం, అది మంచి చికిత్స చేస్తుంది" అని చెప్పింది. కోయిల వద్దకు వెళ్లగా "నేను వైద్యం చేస్తాను కానీ శుల్కం చెల్లించాల్సి వస్తుంది" అంది కోయిల. "సరే" అని ఒప్పుకుంది గుడ్లగూబ. "దానికి నేను హామీ" అంది కాకి. 

కోకిల గుడ్లగూబతో "దీనికి మందులు అవసరం లేదు. నువ్వు నీళ్లలో ఒక గంట కూర్చో. సరిపోతుంది" అని చెప్పింది. 

గుడ్లగూబ గంటసేపు నీళ్లలో కూర్చుంది. మట్టి పెళ్ల నీళ్లలో కరిగిపోయింది. గుడ్లగూబకు నొప్పి తగ్గింది. 

మరునాడు కోకిల గుడ్లగూబను శుల్కం అడగగా అందుకు గుడ్లగూబ "అయినా నువ్వు చేసిన చికిత్స ఏమిటి? మందు లేమైనా ఇచ్చావా? అని అడిగింది. కోకిల కాకి దగ్గరకు వెళ్ళింది. కాకి వద్ద శుల్కం చెలించేటంత దానం లేదు. అది హామీ ఇచ్చింది కాబట్టి శుల్కానికి బదులుగా కోకిల గుడ్లను చూసుకోడానికి ఒప్పుకుంది. అందుకే ఇప్పటికీ కాకి కోకిల గుడ్లను కాపాడుతూనే వుంది! గుడ్లగూబ శుల్కం చెల్లించనందుకు పగలంతా తప్పించుకుని రాత్రి మాత్రం బయట తిరుగుతుంది. 


కుశలుడి నిజాయితీ


కుశలుడి నిజాయితీ

పూర్వం భజరంగిపురం అనే రాజ్యంలో కుశలుడు అనే తెలివైన మంత్రి ఉండేవాడు. కుశలుడు పేరుకు తగ్గట్టే ఎంతో తెలివైన వాడే కాకుండా నిజాయితీ పరుడు, నమ్మదగినవాడు కూడా. 

ఒకరోజు కుశలుడి ఇంటికి పొరుగు రాజ్యంలో నివసిస్తున్న ఆయన మేనల్లుడు వచ్చాడు. ఒక సాయంత్రం వారిద్దరూ సరదాగా నగరంలో ఆలా నడుచుకుంటూ వెళుతుండగా, మాటల సందర్భంలో "మామయ్య, మీ రాజు దగ్గర ఎన్ని గుర్రాలు, ఏనుగులు ఉన్నాయో చెప్పగలవా? అసలు మీకున్న సైనిక శక్తి ఏపాటిది?" అని అడిగాడు కుశలుడి మేనల్లుడు. 

"ఈ విషయాలు నువ్విలా నన్ను అడగడం, నేను వివరాలు చెప్పడం సముచితం కాదు" అని జవాబిచ్చాడు కుశలుడు. 

"కానీ మామయ్య నేను నీ మేనల్లుడిని. నువ్వు నన్ను నమ్మటం లేదా? నేను నీ స్వంత కుటుంబంలోని మనిషిని. మన వంశం నిజాయితీకి, నమ్మకానికి మారుపేరు. నువ్వు చెప్పిన విషయాలు నేను రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేస్తున్నాను. నా కంఠంలో ప్రాణముండగా ఈ విషయాలు నేను మరొకరికి చెప్పను" అన్నాడు కుశలుడి మేనల్లుడు. 

"నువ్వు నా వంశానికి చెంది ఉండటం నాకు సంతోషకరమైన విషయమే. అయితే నాకు నా కుటుంబం కంటే రాజ్యమే ముఖ్యమని రాజ్యానికి సంభందించిన వివరాలు నా కుటుంబ సభ్యుల ముందైనా నోరు విప్పనని నేను మా రాజుకు మాటిచ్చాను. నీ మామ నిజాయితీ చూసి నువ్వు గర్వపడతావని అనుకుంటాను" అని ఎంతో సౌమ్యంగా చెప్పాడు కుశలుడు. 

దానితో కుశలుడి మేనల్లుడు నిరాశతో తన దేశానికీ తిరిగి వెళ్ళిపోయాడు. 


Intelligent Rabbit - తెలివైన కుందేలు

 

తెలివైన కుందేలు

భీమయ్య, అతని కుటుంబ సభ్యులు వారి ఊరి చివర వున్నా చెరువు దగ్గరకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడే రెండు రోజులు వుండాలనుకున్నారు. మొదటిరోజు చాల సంతోషంగా గడిపారు. వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నింటినీ తిన్నారు. కానీ మరుసటి రోజు కోసం ఏమీ మిగలలేదు. 

భీమయ్యకు ఒక ఆలోచన తట్టింది. ఆ చెరువుకు చుట్టుపక్కల వున్న చాల జంతువులు నీళ్లకోసం వస్తాయి. అప్పుడు ఉపాయంగా ఒక మేకనో, కుందేలునో పట్టుకుంటే, మంచి భోజనానికి ఏర్పాటు అయినట్లే అని ఆనందించాడు. చెరువు దగ్గర ఒక కొడవలిని చేతిలో పట్టుకుని పడుకుని నిద్రపోతున్నట్టు నటించాడు. ఏదైనా జంతువు దగ్గరకు రాగానే దాన్ని గబుక్కున పట్టుకోవాలనే  అంచనా వేసాడు. ఇంతలో అక్కడికి  చెరువులో నీళ్లు తాగడానికి ఒక కుందేలు వచ్చింది. దూరం నుండి భీమయ్యను గమనించింది. దానికి అనుమానం వచ్చింది. మెల్లగా వెళ్లి అతని చేతిలో వున్న కోడవలిని లాగింది. భీమయ్య మళ్ళీ కొడవలిని తన వైపు లాగాడు. కుందేలుకు భీమయ్య నిజంగా నిద్ర పోలేదు అని తెలిసి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. భీమయ్య నిరాశగా లేచాడు. ఎదుటివారి తెలివిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అని తెలుసుకున్నాడు.  

Thursday, January 5, 2023

కుందేలు బెరుకు - Rabbit Fear


కుందేలు బెరుకు

ఒక రైతు దగ్గర ఒక ఆవు, గుర్రం, కుక్క ఉండేవి. ఆవు, గుర్రం పొలం పక్కనే వున్న అడవుళ్ళలో మేతకు వెళ్ళేవి. వాటితో పాటు కుక్క కూడా వెళ్ళేది. కలసి వెళ్లడం, రావడం వల్ల  అవి మంచి స్నేహితులయ్యాయి. ఒక దాని పట్ల ఒకటి ఎంతో ఆప్యాయంగా ఉండేవి. వీటి స్నేహాన్ని ఒక కుందేలు గమనించింది. "నాకు కూడా ఇలాంటి స్నేహితులుంటే ఎంత బాగుండేది" అనుకుంది. వాటి వద్దకు వెళ్లి "నాతో స్నేహం చేస్తారా?" అని అడగటానికి దానికి సిగ్గు, బెరుకు.

ఇలా ఉండగా ఒక రోజు ఒక నక్క కుందేలును వెంబడించింది. ఆ కుందేలు ఆవు వద్దకు  వెళ్లి తనను రక్షించమని అడిగింది. ఆవు గుర్రాన్ని అడిగింది. గుర్రం కుందేలును తన వీపుపై ఎక్కించుకుంది. కుక్క ఆవు కలిసి ఆ నక్కను బెదిరించి వెళ్ళగొట్టాయి. కుందేలు చాలా సంతోషించింది. కుక్క, గుర్రం, ఆవులకు కృతజ్ఞతలు తెలిపింది. తాను ఎన్నో రోజుల నుండి వాటితో స్నేహం చేయాలనుకున్న విషయాన్నీ బెరుకు వల్ల చేయలేకపోయినట్లు వాటికి చెప్పింది.

అప్పుడు ఆ మూడు జంతువులూ "స్నేహం చేయాలనుకున్నప్పుడు బెరుకు పనికిరాదు. ఒకరితో ఒకరు స్నేహంగా వున్నప్పుడు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా దానిని స్నేహితుల సహాయంతో ఎదిరించగలం. నేటినుండి నువ్వు కూడా మా స్నేహితుడివే" అన్నాయి. కనీసం ఆపద వచినపుడైన బెరుకును విడిచినందుకు కుందేలు సంతోషించింది. 


Three Formulas - మూడు సూత్రాలు


  మూడు సూత్రాలు


ఉజ్జయినీ రాజ్యంలో శ్రీముఖుడనే పండితుడి గురుకులం వుంది. అక్కడ రాకుమారులు విద్యనభ్యసించేవారు. ఒక ఏడాది గురుకుల విద్య పూర్తి చేసుకుని వెళ్లాల్సిన నాగదత్తుడు అనే యువకుడు మాత్రం దేనిలోనూ నైపుణ్యం సంపాదించలేదు. చివరగా గురువు ఆ విద్యార్థికి... "నడవగా నడవగా గమ్యం చేరుకోవచ్చు, అడగ్గా అడగ్గా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు... మెలకువగా ఉంటే ప్రాణాల్ని కాపాడుకోవచ్చు... అన్ని విద్యల సారాంశమూ ఇదే. వీటిని అనుసరించు" అని హితబోధ చేసాడు. 

గురుకులం నుంచి బయటకు వెళ్ళగానే నాగదత్తుడికి ఉజ్జయినీ నగరం చూడాలని అనిపించింది. కానీ అది చాల దూరంలో వుంది. బండిపై వెళ్లాలన్నా అతడి దగ్గర సరిపడా డబ్బు లేదు. దాంతో మూడు రోజులు నడిచి ఉజ్జయిని చేరుకున్నాడు. అప్పుడు నాగదత్తుడికి గురువు చెప్పిన... "నడవగా నడవగా గమ్యం" అన్న మాట మీద నమ్మకం కుదిరింది. 

ఉజ్జయిని నగరాన్ని పూర్తిగా చూడాలంటే అక్కడ కొన్ని రోజులు ఉండాలి. అతని దగ్గర డబ్బు లేదు. దాంతో ఓ దుకాణంలో పనికి కుదిరాడు. గురువు చెప్పిన మాట "అడగ్గా అడగ్గా కొత్త విషయం తెలుస్తుంది" అని గుర్తు చేసుకున్నాడు నాగదత్తుడు. ఉజ్జయినిలో అందరినీ మంచి చేసుకుని క్రమంగా నగర విశేషాలుని  తెలుసుకున్నాడు. ఉజ్జయినిని  రాణి పరిపాలిస్తోందని ఓ మిత్రుడి ద్వార తెలుసుకున్నాడు. రాణి పెళ్లి చేసుకుని భర్తకు రాజ్యం అప్పగించాలనే ఆలోచనలో వున్నా, ఆమెను చేసుకోబోయే వరుడు పెళ్ళికి ముందు రాత్రి మరణిస్తాడని చెప్పాడతడు. 

"మెలకువగా ఉంటే ప్రాణభయం ఉండద"న్న గురువు మాట గుర్తొచ్చింది నాగదత్తుడికి. వెంటనే రాణిని పెళ్లిచేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అందరిలానే అతడిని పెళ్ళికి ముందురోజు రాత్రి ఒంటరిగా ఓ గదిలో ఉంచారు. నాగదత్తుడు మంచంపై నిద్ర పోకుండా తలగడపై గుడ్డలు కప్పి వుంచి, చేతిలో కత్తి పట్టుకుని ఓ పక్కన దాక్కున్నాడు. అర్థరాత్రి తరువాత పైనుంచి ఓ పాము మంచంపై పడి కప్పి ఉంచిన తలగాడని కాటేసింది. ఆ పక్కనే కాచుక్కూర్చోన్న నాగదత్తుడు వెంటనే కత్తితో పాముని రెండు ముక్కలు చేసాడు. తెల్లవారేసరికి నాగదత్తుడు సజీవంగా ఉండటంతో రాణి అతడిని పెళ్ళిచేసుకుని రాజ్యాన్ని అప్పగించింది. 


Secret of Success - విజయ రహస్యం


విజయ రహస్యం

గ్రీకు  తత్వవేత్త సోక్రటీస్ తరచూ ప్రజల్లోకివెళ్ళి వారితో అన్ని విషయాలు వివరంగా మాట్లాడేవాడు. ఎంత కష్టమైన విషయాన్నైనా సామాన్యులకి సైతం అర్థం అయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఓ సారి అలా ఒకచోట పర్యటిస్తున్నప్పుడు ఒక యువకుడు సోక్రటీస్ ను కలిసి "విజయ సాధకుల రహస్యం ఏమిటో నాకు ఒక్క మాటలో చెప్పండి" అని అడిగాడు. బదులుగా సోక్రటీస్ ఆ యువకున్ని ఆ రోజు సాయంత్రం సమీపంలోని నది దగ్గరకు రమ్మని చెప్పాడు. 

సోక్రటీస్ చెప్పినట్టే ఆ యువకుడు సాయంత్రానికి నది ఒడ్డుకు చేరుకున్నాడు. "గురువుగారూ ఇప్పుడు చెప్పండి విజయ సాధకుల రహస్యం ఏమిటో" అని అడిగాడా యువకుడు. సోక్రటీస్ అతడి చేయి పట్టుకొని నది లోకి నడిపించాడు. పీకల్లోతు నీటిలోకి తీసుకెళ్లక యువకుడి తలను నీటిలో ముంచి అదిమి పెట్టాడు. దాంతో ఊపిరాడక ఆ యువకుడు నీటిలోంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ సోక్రటీస్ కొద్ధి సెకెన్ల పాటు అలాగే ఉంచాడు. కాసేపటికి అతడు సోక్రటీస్ ను బలంగా పక్కకు తోసేసి మరీ తలను నీటిలోంచి పైకి లేపాడు. "తల నీటిలో ఉన్నపుడు నీకు యేమనిపించింది" అని అతడిని అడిగాడు సోక్రటీస్. "ఊపిరి ఆడలేదు. చచ్చి పోతానేమోననిపించింది. తల ఎత్తేందుకు శతవిధాలా ప్రయత్నించా. తప్పనిసరి పరిస్థితుల్లోనే మిమ్మల్ని తోసేసాను" అని బదులిచ్చాడు ఆ యువకుడు. 

"నువ్వు నీటిలో వున్నపుడు గాలికోసం ఎంతలా తపించవో, అడ్డుగా వున్న నన్ను ఎలా తోసేశావో అదే విధంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఎన్ని ఆటంకాలు ఎదురైనా వదలకూడదని, దాన్ని సాధించేందుకు పట్టుదలతో కృషిచేయడమే విజయ సాధకుల రహస్యం" అని చెప్పాడు సోక్రటీస్.

నీతి: పట్టుదలతో కృషిచేస్తే విజయం నీదే.  

బుద్ధిబలం - Strength of the Intellect


బుద్ధిబలం   

పూర్వం ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమసేనుడు పాలించేవాడు. అతడు రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. కానీ ప్రజల్లో రోజురోజుకీ స్వార్ధం పెరికిపోతోందనీ, పరోపకారం చేసేవారే కరవయ్యారనీ తెలుసుకున్నాడు. తన బుద్ధిబలంతో దీనికి ఓ చక్కని పరిష్కారం చూపాలనుకున్నాడు రాజు. 

ఉజ్జయిని ప్రధాన కూడలిలో ఓ అర్థరాత్రి భటులచేత ఓ బండ రాయిని పెట్టించాడు విక్రమసేనుడు. ఉదయాన్నే ఆ తోవన వెళ్లిన షావుకారు గుర్రపు బండి రాయిని ఢీ కొట్టబోయింది. బండి నడిపేవాడు ఆ రాయిని తియ్యడానికి దిగబోయేసరికి, "మనకు వేరేపని వుంది నడు" అని వాడిని అడ్డుకున్నాడు షావుకారు. తరువాత కాసేపటికి ఆ దారినే వచ్చిన మరొకడు ఆ రాయి తగిలి పడబోయి రాజునీ, రాజ్యాన్నీ తిట్టుకున్నాడు తప్ప దాన్ని పక్కకు పెట్టడం గురించి ఆలోచించలేదు. 

మరి కాసేపటికి అటుగా వెళ్లిన ఓ రైతు రాయిని పక్కకు జరపాలనుకున్నాడు. కానీ, ఒక్కడికీ సాధ్య పడలేదు. దాంతో అటుగా వెళ్తున్న ఓ పండితుణ్ణి సాయం చేయమని అడిగాడు. "నేను పండితుణ్ణి. నా బుద్ధిబలానికి పని చెప్పు చేస్తాను. కానీ ఈ పని చేయడం నాకు అవమానం" అని చెప్పి వెళ్ళిపోయాడు. మరో ఇద్దరు బాటసారుల నుంచీ ఇలాంటి సమాధానమే రావడంతో ఆఖరికి రైతు ఒక్కడే కష్టపడి రాయిని దారిలోంచి పక్కకు తొలగించాడు. ఆ రాయిని తొలగించాక రైతుకి ఓ సంచి కనిపించింది. దానిలో కొంత డబ్బు, ఒక చీటీ వున్నాయి. చీటీ పై, "రాయి తొలిగించిన వారికీ ఇది రాజుగారి బహుమతి" అని రాసుంది. 

ఆ విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలిసింది. దాని వెనుక అసలు కారణం పరోపకార గుణాన్ని పెంచుకోవాలని గుర్తుచేయడమేనని తెలుసుకొన్నారు ప్రజలంతా. అప్పటినుంచి తమ పనులు చేసుకోవడమే కాకుండా రాజ్యానికి ఉపయోగపడే పనుల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. 


Help that not crossed boundaries - హద్దుమీరని సాయం

 

హద్దుమీరని సాయం

అడవిలో ఓ మర్రిచెట్టు కింద వేటగాడి వలలో ఒక పిల్లి చిక్కుకుంది. అదే సమయంలో చెట్టుకింద కన్నంలో వుండే ఎలుక బయటకు వచ్చింది. పిల్లి వలలో చిక్కుకోవడంతో అది నిర్భయంగా చెట్టు కింద అటూ ఇటూ తిరిగింది. కన్నంలోకి పోదామని చూస్తే అక్కడే ఓ ముంగిస కాచుకు కూర్చొని వుంది. ఎలుకకు భయమేసి, రక్షించమని పిల్లిని అడిగింది. 

"పిల్లి మావ, మనం శత్రువులమే కావొచ్చు. కానీ ఇద్దరం ఈ చెట్టు నీడనే బతుకుతున్నాం. ఇదిగో ఈ ముంగీస వల్ల నా  ప్రాణాలకు ముప్పుంది. నువ్వు నాకిప్పుడు ఆశ్రయమిస్తే తరువాత వలను కొరికి నిన్ను రక్షిస్తాను" అని చెప్పింది ఎలుక.  

పిల్లి మావ అలోచించి, "సరే, నిన్ను తప్పక రక్షిస్తాను. వెంటనే ఈ వలలో దూరి ప్రాణాలు కాపాడుకో" అని చెప్పింది. 

వలలో దూరిన ఎలుక ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ముంగిస అక్కడినుంచి వెళ్ళిపోయింది. వెంటనే ఎలుక బయటకు వచ్చేసింది. 

"వల కొరికి నన్ను రక్షించు ఎలుక మావ" అని అడిగింది పిల్లి. 

"ఆ తరువాత నా ప్రాణాలు తీస్తావేమోనని భయంగా వుంది" అంది ఎలుక. 

"లేదు మిత్రమా, నిన్నేమీ చేయను, నా మాట నమ్మి ముందు ఈ వల కొరుకు" అని తొందరపెట్టింది పిల్లి. రెండూ ఇలా వాదులాడుకునేసరికి తెల్లారిపోయింది. 

"ఎలుక మావ, ఇంకా ఆలస్యం చేస్తే వేటగాడు వచ్చేస్తాడు. ఆపదలో నిన్ను కపాడిన నాకు చేసే సాయం ఇదేనా... " అంది పిల్లి. 

ఆ మాటలకు ఎలుక... "మిత్రమా, అంత మాట అనొద్దు" అంటూ గబగబా వలను కొరికింది. అంతలోనే అక్కడికి వేటగాడు రావడంతో ఎలుక కన్నంలోకీ, పిల్లి చెట్టుమీదకీ పరుగుతీసాయి. 

వేటగాడు చెట్టుకింద చాలాసేపు నిల్చొని నిరాశతో వెళ్ళిపోయాడు. వెంటనే చెట్టుపైనున్న పిల్లి కన్నంలో వున్నా ఎలుకను పిలిచి... "మిత్రమా, ఆపదలో ఒకరినొకరం కాపాడుకున్నాం. ఇక నుంచీ మనం స్నేహితులుగా ఉందాం" అని అడిగింది. 

బదులుగా ఎలుక.. "ఆపదలో స్నేహితుడిగా కనిపించిన నేను, మరో రోజు ఆహారంగా కనిపించవచ్చు. అందుకే ఇకపై నీ బతుకు నువ్వు చూసుకో, నా బతుకు నేను చూసుకుంటా" అని చెప్పి కన్నంలోకి వెళ్ళిపోయింది ఎలుక. 

నీతి: ఆపదలో శత్రువులకు సాయం చేయొచ్చు, కానీ వారితో స్నేహం చెయ్యకూడదు.