ధర్మరాజు
ఒకానొక పల్లెటూరిలో నరసింహ అనే రైతు ఉండేవాడు. ఆటను చాల అహంకారి, కోపిష్టి. ఊరిలో అందరితో తగవు పెట్టుకునే వాడు. ఊరిలో ఎవరితోనూ స్నేహంగా ఉండేవాడు కాదు. కోపం వచ్చినపుడు చేయి చేసుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదు.
ఒక రోజు ఆ ఊరికి ధర్మరాజు అనే రైతు వచ్చాడు. ఊరిలో జనమంతా అతనితో "నువ్వు నరసింహ జోలికి వెళ్ళకు, అతను చాల చెడ్డవాడు, అతనితో స్నేహం చేయకు" అని సలహా ఇచ్చారు. కానీ ధర్మరాజు మంచి స్వభావం కలవాడు కనుక అతనితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నరసింహ ప్రతిసారి ధర్మరాజును అవమానించి, తగువులాడి పంపించాడు. ఊరిజనమంతా ధర్మరాజుతో "చూసావా మేము చెప్పింది ఇప్పటికైనా అర్థమైందా?" అని అడిగారు. దానికి ధర్మరాజు " అందుకే నేను సమయం చూసి నరసింహను చంపుతాను" అని చెప్పాడు.
ఒక రోజు నరసింహ పక్క ఊరికి ఎడ్ల బండి మీద వెళ్ళాడు. జోరుగా వర్షం కురిసింది. తను ఊరికి తిరిగి వస్తూ ఉండగా చీకటి పడింది. బంక మట్టిలో బండి చక్రం ఇరుక్కుపోయింది. ఇక తానూ ఆ రాత్రికి ఊరు చేరుకోగలనే నమ్మకం కూడా లేక పోయింది నరసింహకు. ఊరిలో వారందరికీ నరసింహ తిరిగి రాలేదన్న విషయం తెలిసిన ఎవ్వరు సహాయం చేయడానికి లేదా అతన్ని వెతకడానికి ప్రయత్నించలేదు.
ధర్మరాజు బండి చిక్కుకున్న ప్రాంతానికి బయలుదేరాడు. ఊరిజనమంతా ఆ అహంకారికి సహాయం చేయడం అనవసరం అన్నారు. అప్పుడు ధర్మరాజు "నేను అతనికి సహాయం చేయడానికి కాదు, చంపడానికి వెళ్తున్నాను" అన్నాడు. కానీ వెళ్లి నరసింహను ఆపద నుండి రక్షించాడు. నరసింహ సిగ్గుతో తలా వంచుకున్నాడు.
జనమంతా ధర్మరాజును "నరసింహాను చంపుతావని వెళ్ళావు ఏమైంది?" అని అడగగా ధర్మరాజు "నేను చంపుతాను అన్నది నరసింహాను కాదు అతని అహంకారాన్ని" అని సమాధానమిచ్చాడు.
No comments:
Post a Comment