కుందేలు బెరుకు
ఒక రైతు దగ్గర ఒక ఆవు, గుర్రం, కుక్క ఉండేవి. ఆవు, గుర్రం పొలం పక్కనే వున్న అడవుళ్ళలో మేతకు వెళ్ళేవి. వాటితో పాటు కుక్క కూడా వెళ్ళేది. కలసి వెళ్లడం, రావడం వల్ల అవి మంచి స్నేహితులయ్యాయి. ఒక దాని పట్ల ఒకటి ఎంతో ఆప్యాయంగా ఉండేవి. వీటి స్నేహాన్ని ఒక కుందేలు గమనించింది. "నాకు కూడా ఇలాంటి స్నేహితులుంటే ఎంత బాగుండేది" అనుకుంది. వాటి వద్దకు వెళ్లి "నాతో స్నేహం చేస్తారా?" అని అడగటానికి దానికి సిగ్గు, బెరుకు.
ఇలా ఉండగా ఒక రోజు ఒక నక్క కుందేలును వెంబడించింది. ఆ కుందేలు ఆవు వద్దకు వెళ్లి తనను రక్షించమని అడిగింది. ఆవు గుర్రాన్ని అడిగింది. గుర్రం కుందేలును తన వీపుపై ఎక్కించుకుంది. కుక్క ఆవు కలిసి ఆ నక్కను బెదిరించి వెళ్ళగొట్టాయి. కుందేలు చాలా సంతోషించింది. కుక్క, గుర్రం, ఆవులకు కృతజ్ఞతలు తెలిపింది. తాను ఎన్నో రోజుల నుండి వాటితో స్నేహం చేయాలనుకున్న విషయాన్నీ బెరుకు వల్ల చేయలేకపోయినట్లు వాటికి చెప్పింది.
అప్పుడు ఆ మూడు జంతువులూ "స్నేహం చేయాలనుకున్నప్పుడు బెరుకు పనికిరాదు. ఒకరితో ఒకరు స్నేహంగా వున్నప్పుడు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా దానిని స్నేహితుల సహాయంతో ఎదిరించగలం. నేటినుండి నువ్వు కూడా మా స్నేహితుడివే" అన్నాయి. కనీసం ఆపద వచినపుడైన బెరుకును విడిచినందుకు కుందేలు సంతోషించింది.
No comments:
Post a Comment