దురాశ
ఇంద్రావతి నదీ తీరంలో సువర్ణపురి అనే రాజ్యాన్ని సోమనాథుడు అనే రాజు పాలించేవాడు. అతడు తరచూ రాజ్యమంతా పర్యటించేవాడు. ప్రజల కష్ట సుఖాలను విచారించి, అవసరమైన వారికి సహాయం చేసేవాడు. ఆ రాజ్యంలో రంగడనే యువకుడు ఉండేవాడు. అతడు చాల దురాశాపరుడు, సోమరి. కష్టపడి పని చేయక భిక్షాటనతోనే జీవనం సాగించేవాడు.
రంగడు ఒక రోజు భిక్షాటన కోసం పొరుగూరు వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఒకామె రంగడి గిన్నె లో బియ్యం పోస్తూండగా, ఆ రోజు రాజు ఆ ఊళ్ళో పర్యటిస్తునట్టు తెలుసుకున్నాడు. గిన్నె నిండా బియ్యం చుస్తే రాజు తనకు ఏమీ దానం చేయకపోవచ్చని బియ్యం మొత్తం కింద పారబోసి ఖాళీ గిన్నెతో పరిగెత్తుకుంటూ రాజా దగ్గరికి వెళ్ళాడు.
"మహారాజా ! మీరు చాలా దానధర్మాలు చేస్తారని విన్నాను. నేను చాలా పేదవాణ్ణి. చాలా రోజులుగా అన్నం కూడా తినలేదు అని రాజుతో చెప్పాడు రంగడు.
బదులుగా రాజు... "నీ కష్టాలు చెప్పడం తప్పించి రాజుకి నువ్వు ఏమీ కానుక ఇవ్వలేవా?" అని అడిగాడు. రంగడి చేతిలోని గిన్నెలో ఐదు గింజలు మాత్రమే అంటుకుని వున్నాయి. వాటిని సోమనాథుడికి ఇచ్చాడు. రాజు ఆ ఐదు బియ్యపు గింజలు తీసుకుని వెళ్ళిపోయాడు.
"రాజు ఎంత పిసినారి. నా దగ్గర ఐదు గింజలు తీసుకుపోయాడు" అని మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి రంగడు తిరిగి ఇంటికి వెళ్లేసరికి గుమ్మం ముందు ఒక బియ్యం బస్తా కనిపించింది. అందులో ఐదు బంగారు నాణేలు కూడా వున్నాయి. అది చూసి రంగడు ఎంతో సంతోషపడ్డాడు.
"మహారాజు పిసినారి కాదు. నేనిచ్చిన ఐదు బియ్యవు గింజలకు బదులుగా ఐదు బంగారు నాణేలు ఇచ్చాడు. నేనే దురాశపడుడిని. విలువైన బహుమానాల ఆశతో చేతిలో వున్న బియ్యాన్ని నేలపాలు చేశాను. ఆ మొత్తం బియ్యం కనుక మహారాజుకి ఇచ్చి ఉంటే బస్తా నిండా బంగారు నాణేలు ఉండేవి. న దురాశకు తగిన శాస్తి జరిగింది" అని బాధపడ్డాడు రంగడు.
నీతి: దురాశ దుఃఖానికి చేటు.
No comments:
Post a Comment