చివరి కోరిక
సోమనాథపురంలో చంద్రగుప్తుడనే వర్తకుడుండేవాడు. అతను తను పండించిన ధాన్యాన్ని పక్కనే వున్నా కోసలనగరంలో జరిగే సంతలో అమ్మడానికి తీసుకువెళ్లాడు. మంచి ధర వచ్చి చాలా ధనం సంపాదించాడు. రాత్రి పూట అంత ధనంతో ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదని కోసల నగరంలో వున్న ఒక పూటకూళ్ళ ఇంట్లో దిగాలనుకున్నాడు. తీరా పూటకూళ్ళ ఇంటికి వెళ్లే సరికి ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో గది దొరకలేదు. ఆ పూటకూళ్ళ ఇంటి యజమాని మంచివాడు. చంద్రగుప్తుణ్ణి తన గదిలోనే ఉండమన్నాడు.
ఆ రాత్రి ఒక దొంగ చంద్రగుప్తుడు, యజమాని పడుకున్న గదిలోకి దూరి చంద్రగుప్తుని ధనాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు. మెలకువ వచ్చిన పూటకూళ్ళ ఇంటి యజమాని అడ్డుకోబోతే దొంగ అతన్ని చంపేశాడు. ఈ గొడవకు పూటకూళ్ళ ఇంట్లో దిగిన యాత్రికులు నిద్రలేచారు. దొంగ కంగారుగా కిటికీలో నుండి పారిపోయాడు. ఆ గదిలోకి వచ్చిన యాత్రికులు యజమాని చనిపోవడం, చంద్రగుప్తుని వద్ద ధనం చూసి పూటకూళ్ళ ఇంటి యజమానిని ధనం కోసం చంద్రగుప్తుడే చంపాడని ఊహించి రాజభటులను పిలిపించారు. రాజభటులు చంద్రగుప్తుణ్ణి కోసలనగర మహారాజు వద్దకు తీసుకువెళ్లారు. చంద్రగుప్తుడు జరిగినదంతా వివరించినా మహారాజు నమ్మలేదు. చంద్రగుప్తుడిని ఉరి తీయమని తీర్పు ఇచ్చాడు. ఏ అపరాధికైనా ఉరి శిక్ష వేసే ముందు ఆఖరి కోరిక ఏమిటని అడగడం ఆనాటి పద్ధతి.
మహారాజు చంద్రగుప్తుడిని "నీ ఆఖరి కోరిక ఏంటి?" అని అడిగాడు. చంద్రగుప్తుడు, తెలివిగా "నాకు శ్రావణ మాసంలో కురిసే వర్షంలో తడవాలని వుంది" అన్నాడు. అయితే అప్పుడు చలికాలం. వర్షాకాలానికి ఇంకా ఆరు నెలలుంది. కానీ అపరాధి ఆఖరి కోరిక తీర్చాల్సిందే. అందుకే మహారాజు ఆరు నెలల తరువాతే చంద్రగుప్తుని ఉరితీయమని ఆదేశించాడు.
రెండు నెలల తరువాత అసలు దొంగ వేరే దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు. అతన్ని రాజభటులు నిలదీయగా పూటకూళ్ళ ఇంట్లో దొంగతనం చేయబోయి యజమానిని చంపింది తనేనని ఒప్పుకున్నాడు. మహారాజుకు అసలు విషయం తెలిసి చంద్రగుప్తుడిని విడుదల చేసాడు.
No comments:
Post a Comment