చైతన్యగుప్తుని మేధస్సు
మైథిలీపురి రాజ్యాన్ని చైతన్యగుప్తుడనే రాజు పరిపాలించేవాడు. అతను మేధావి అని దూరదేశాల వరకు మంచి పేరు సంపాదించాడు. చాణక్యపురి రాణి ప్రియంవదకు చైతన్యగుప్తుని మేధస్సు గురించి సమాచారం అందింది. అతని మేధస్సును పరీక్షించాలనుకుంది.
ఒకరోజు నేరుగా మైథిలీపురికి బయలుదేరి చైతన్యగుప్తుని ఆస్థానానికి చేరుకుంది. చైతన్యగుప్తుడు రాణి ప్రియంవదను సాదరంగా ఆహ్వానించాడు.
ప్రియంవద, "రాజా! మీ మేధస్సు గురించి దేశ విదేశాలలో చర్చలు జరుగుతున్నాయి. స్వయంగా అది చూసిపోదామని వచ్చాను" అని తనతో తెచ్చిన రెండు పూలదండలు చైతన్య గుప్తునికి చూపించింది.
"మహారాజా! ఈ రెండు దండలలో నిజమైన పూలతో అల్లిన దండ ఏదో కనిపెట్టగలరా?" అని అడిగింది.
ఆ రెండు పూల దండలు ఒకేలా వున్నాయి. ఏది నిజమైన పూలతో అల్లిందో తెలుసుకోవడం చాల కష్టం. చైతన్యగుప్తుడు తదేకంగా కాసేపు దండలను గమనించాడు.
కాసేపటి తరువాత "ఇదే అసలైన పూలతో కట్టిన దండ" అని చెప్పాడు. ప్రియంవద ఆశ్చర్యంగా "అదెలా కనిపెట్టారు మహారాజా" అని అడిగింది.
"మహారాణి! రెండు దండలూ అచ్చంగా ఒకేలా ఉన్నప్పటికీ తేనెటీగలు ఆకర్షించేది అసలైన పూలదండే కదా! కిటికీలో నుంచి ఒక తేనెటీగ వచ్చి ఈ పూల దందా మీద వాలడం గమనించి ఇదే అసలైన పూలతో అల్లిన దండ అని కనిపెట్టాను" అన్నాడు.
దానితో రాణి ప్రియంవద చైతన్యగుప్తుని మేధస్సును కొనియాడింది.
No comments:
Post a Comment