ఎద్దు - గాడిద
కిట్టయ్య అనే రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానితో అతడు పొలం దున్నడం, బండిలాగడం చేసేవాడు. ఈ పనులతో రోజూ ఎద్దు అలసిపోయేది. తన దుస్థితికి యజమానిని రోజూ మనసులోనే తిట్టుకునేది.
కొన్ని రోజుల తరువాత కిట్టయ్య ఒక గాడిదను కొనుక్కొచ్చి కొట్టంలో కట్టాడు. ఆ రోజు సాయంత్రం కొట్టంలో గాడిద ఎద్దుతో మాట్లాడుతూ... " ఎలా వున్నావు మిత్రమా ?యజమాని నిన్ను బాగా చూసుకుంటాడా?" అని అడిగింది.
"లేదు మిత్రమా, నన్ను ప్రతి రోజూ కొడతాడు. పొద్దస్తమానం నాతో ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటాడు" అంది.
"పని తప్పేలా నేనొక ఉపాయం చెప్పనా?" అని అడిగింది గాడిద.
నువ్వు ఏం చెప్పినా అది తప్పకుండా చేస్తాను మిత్రమా" అని బదులిచ్చింది ఎద్దు.
"నువ్వు జబ్బు పడ్డట్టుగా నటించు. గడ్డి తినకు, కుడితి తాగకు. అలా చేస్తే నీకు నిజంగానే ఆరోగ్యం బాగాలేదు అనుకుంటాడు. జాలిపడి నిన్ను పనికి తీసుకెళ్లడు" అని సలహా ఇచ్చింది గాడిద. ఆ సలహా ప్రకారం మర్నాడు ఎద్దు మేత మేయలేదు, కుడితి తాగలేదు. కనీసం నిలబడలేనట్టు నటించింది. ఎద్దు పరిస్థితి చూసాక యజమాని దాన్ని ఏమీ అనకుండా వదిలేసాడు.
రెండోరోజు కూడా ఎద్దు అలాగే చేసింది. రైతు దాని జబ్బు ఇంకా తగ్గలేదు అనుకుని సగంలో నిలిచిన పనిని పూర్తి చేయడానికి గాడిదను పొలానికి తీసుకెళ్లాడు. అలవాటులేని పని కావడంతో పొలం దున్నిన గాడిద బాగా అలసిపోయింది. "ఓరి దేవుడో! ఈ చాకిరీ నేనెక్కడ చేస్తాను. పని ఎగ్గొట్టడానికి ఎద్దుకు ఉపాయం చెబితే అది నా మెడకు చిక్కుకుంది. అబద్ధం చెప్పడమే కాదు, అబద్ధం చెప్పమని ఎవరికైనా సలహా ఇవ్వడం కూడా చాల తప్పు. ఇంకెప్పుడూ ఇలాంటి తెలివి తక్కువ పని చేసి కష్టాలు కొనితెచ్చుకోను" అనుకుంది బుద్దిగా.
నీతి: అబద్ధం చెప్పడమే కాదు, అబద్ధం చెప్పమని ఎవరికైనా సలహా ఇవ్వడం కూడా చాల తప్పు
No comments:
Post a Comment