ఆకలి కాయల పులుసు
మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాల పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంట వారిని నియమించాడు. నాలుగు పూటలూ రకరకాల వంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికరమైన భోజనానికి అలవాటుపడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని రాజుకు రానురాను ఏ వంటకం రుచించకుండా పోయింది. ఏదైనా అతిగా చేస్తే అంతేమరి! ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలు పెట్టాడు.
ప్రసిద్ధిచెందిన వంటివారు వండినప్పటికీ, రుచిగా లేదని శిక్షించాడు. ఆలా ఆఖరికి, రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది.
అక్కడి ఆస్థానంలో పని చేసేవారే రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకున్నారు. వంటవారి కోసం రాజ్యమంతా వెతికిన భీమసేనుని తృప్తి పరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు.
ఆఖరికి పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్దమయ్యాడు. ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేనరాజు "ప్రపంచంలో నేను ఎన్నడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా?" అని అడిగాడు.
అప్పుడు ఆ యువకుడు "మహారాజా మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి వుంది. దాని పేరు ఆకలి కాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. కోసిన వెంటనే వండాలి కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు" అన్నాడు. రాజుకు కొత్త వంటకం గురించి విని నోరూరింది. ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు.
ఆలా పొద్దున్నే బయలు దేరిన వాళ్ళు సాయంత్రం అయినా నడుస్తూనే వున్నారు. రాజుకు చాలా ఆకలి వేయసాగింది. "ఇంకా ఎంత దూరం?" అని అడగడం మొదలు పెట్టాడు. ఆఖరికి యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు. "మహారాజా, ఇదే ఆకలి కాయల పులుసు" అన్నాడు. భీమసేనుడు ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచించింది. అలంటి పులుసు తాను ఎన్నడూ తినలేదు అన్నాడు.
అప్పుడు యువకుడు "మహారాజా! ఇది మామూలు ఉల్లిపాయలు పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది. ఆకలి లేని వారికీ పంచభక్ష్య పరమాన్నమైనా రుచించదు. అదే ఆకలితో వున్నా వారికీ ఎలాంటి భోజనమైన రుచిస్తుంది." అని చెప్పాడు. రాజుకు తన పొరపాటు తెలిసివచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు.
No comments:
Post a Comment