విలువైన కానుక
ఒక ఊరి చివర గుడిసెలో విమలమ్మ తన కొడుకు రాధీశ్ తో నివసించేది. తండ్రి లేనందువల్ల కొడుకును కష్టపడి పెంచింది. రాధీశ్ చాలా బుద్ధిమంతుడు. మంచి విద్యాభ్యాసం కోసం విమలమ్మ తన కొడుకుని పక్క ఊరిలో వున్న గురువుగారి దగ్గరికి పంపించేది. రోజూ ఆశ్రమానికి వెళ్లాలంటే అడవి దాటవలసి వచ్చేది. "అమ్మా! నాకు ఒంటరిగా అడవి దాటాలంటే భయం" అన్నాడు రాధీశ్. అందుకు విమలమ్మ "బాబు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడెప్పుడు మనతోనే ఉంటాడు. నువ్వు పిలిచినప్పుడు తప్పకుండ వస్తాడు" అని చెప్పింది.
ఒక రోజు రాధీశ్ అడవిలో నడిచేటప్పుడు, "కృష్ణా, కృష్ణా నాకు భయంగా వుంది" అని పిలిచాడు. వెంటనే దేవుడు బాలుని రూపంలో ప్రత్యక్షమై అతన్ని అడవి దాటించాడు. ఇలా రోజూ రాధీశ్ కృషుణ్ణి పిలవడం, బాలుని రూపంలో వున్న కృష్ణుడితో ఆదుకోవడం మొదలుపెట్టాడు.
ఒక రోజు గురువుగారి ఆశ్రమంలో పెద్ద పూజ జరగనుంది. చాలా పెద్ద విందును ఏర్పాటు చేసారు. రాధీశ్ తోటి శిష్యులందరు బుట్టలకొద్దీ పళ్ళు తేవాలని, బిందెల నిండా నెయ్యి, పాలు తేవాలని మాట్లాడుకున్నారు. రాధీశ్ తన తల్లిని అడిగినప్పుడు అంతంత కానుకలు ఇచ్చే స్తోమత మనకు లేదని చెప్పింది విమలమ్మ. నిరాశతో, తన తోటి విద్యార్థులు, గురువు ఎక్కడ హేళన చేస్తారో అనే బాధతో అడవి దాటుతూ ఆశ్రమం వైపుకి వెళ్ళాడు.
ఎప్పటిలాగానే, అడవిలోకి కృష్ణుడు వచ్చాడు. "రాధీశ్ ఎందుకు బాధ పడుతున్నావ్?" అని అడిగాడు. జరిగిన విషయమంతా వివరించాడు రాధీశ్. కృష్ణుడు ఒక చిన్న గిన్నెలో పాలిచ్చి "ఇది మీ గురువుగారికి ఇవ్వు" అని చెప్పాడు. రాధీశ్ ఆశ్రమం చేరాడు. తోటి విద్యార్థులందరూ పెద్ద పెద్ద బిందెల నిండా, గంగాళాల నిండా పాలను తెచ్చారు. రాధీశ్ తెచ్చిన చిన్న గిన్నెను చూసి తోటి శిష్యులంతా హేళన చేసారు. గురువుగారు ఆ గిన్నెను స్వీకరించి ఒక గంగాళంలొ పోశారు. ఆశ్చర్యం! అది నిండిపోయింది. గిన్నెలో ఇంకా పాలున్నాయి! ఇంకో గంగాళంలో పోశారు. అదీ నిండిపోయింది. ఆలా ఆ గిన్నెలో పాలు అక్షయమవుతూనే వున్నాయి. గురువుగారు, విద్యార్థులు చాలా ఆశ్చర్యపోయారు.
గురువుగారు రాధీశ్ ని "ఆ పాలు ఎవరిచ్చారు?" అని అడిగారు. రాధీశ్ జరిగిన విషయమంతా చెప్పినప్పుడు గురువుగారు "రాధీశ్ నీకు అడవిలో రోజూ కలిసే బాలుడు ఎవరో కాదు. శ్రీ కృష్ణ పరమాత్ముడే. నువ్వు ఎంత కానుక తెచ్చావు అనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో ఇస్తున్నావనేదే ముఖ్యం" అన్నారు. తోటి విద్యార్థులు రాధీశ్ ని హేళన చేసినందుకు సిగ్గుతో తలవంచుకున్నారు.
No comments:
Post a Comment